
అండర్-19 ప్రపంచకప్‌లో బెన్‌మేయ్స్ రికార్డు ఇన్నింగ్స్
ఐసీసీ అండర్-19 పురుషుల క్రికెట్ ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ బెన్ మేయ్స్ చరిత్ర సృష్టించాడు. స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 117 బంతుల్లోనే 191 పరుగులు బాదిన మేయ్స్, అండర్-19 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. మేయ్స్ ఇన్నింగ్స్ అండర్-19 ప్రపంచకప్ చరిత్రలో సంయుక్తంగా రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరుగా నిలిచింది. శ్రీలంక ఆటగాడు హసిత బోయగొడ చేసిన స్కోరును అతను సమం చేయగా, ఈ టోర్నమెంట్‌లోనే జపాన్‌పై విరాన్ చాముదిత్ చేసిన ప్రపంచ రికార్డు స్కోరుకు కేవలం ఒక్క పరుగు దూరంలో నిలిచాడు. మేయ్స్ అద్భుత ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి భారీ 404 పరుగులు చేసింది. ఇది అండర్-19 ప్రపంచకప్ చరిత్రలో ఆరో అత్యధిక జట్టు స్కోర్ కాగా, ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు నమోదైన అత్యధిక స్కోర్‌గా నిలిచింది.
అద్భుతమైన అనుభూతిని ఇచ్చింది
మ్యాచ్ అనంతరం మేయ్స్ మాట్లాడుతూ ఈ ఉదయం ఏం జరుగుతుందో తెలియదు. ఒక్కో బంతిని ఒక్కోలా ఆడాలని మాత్రమే ప్రయత్నించాను. మోర్స్, ర్యూ, కాలెబ్ ల నుంచి మంచి సహకారం లభించింది. జట్టుగా ఎక్కడ పరుగులు తీయవచ్చో, ఏ బౌలర్లను లక్ష్యంగా చేసుకోవాలో ముందుగానే నిర్ణయించుకున్నాం. అది నేడు చాలా ఉపయోగపడింది. ఈ ఇన్నింగ్స్ నాకు అద్భుతమైన అనుభూతిని ఇచ్చిందని అన్నాడు. ఇంగ్లండ్ తొలి వికెట్‌గా బెన్ డాకిన్స్ ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన మేయ్స్, మొదటి నుంచే ప్రత్యర్థి బౌలర్లపై దాడి ప్రారంభించాడు. జో మోర్స్‌తో కలిసి సుమారు 22 ఓవర్లలోనే 188 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. మోర్స్ 81 పరుగులతో చక్కటి సహకారం అందించగా, ఈ భాగస్వామ్యం మ్యాచ్‌ను పూర్తిగా ఇంగ్లండ్ వైపునకు తిప్పింది. 18 ఏళ్ల మేయ్స్ తన ఇన్నింగ్స్‌లో 18 ఫోర్లు, 8 సిక్సర్లు బాది స్కాట్లాండ్ బౌలింగ్ దాడిని చిత్తుచేశాడు.
