Let's talk: editor@tmv.in
అండర్-19 ఆసియా కప్: మలేసియాపై భారత్‌ ఘన విజయం

అండర్-19 ఆసియా కప్: మలేసియాపై భారత్‌ ఘన విజయం

Shaik Mohammad Shaffee
17 డిసెంబర్, 2025

ఏసీసీ మెన్స్ అండర్-19 ఆసియా కప్ 2025లో భారత జట్టు తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది. మలేషియాతో జరిగిన మ్యాచ్‌లో యువ భారత్ ఏకంగా 315 పరుగుల భారీ తేడాతో గెలిచింది. ఈ విజయంలో అభిజ్ఞాన్ కుందు డబుల్ సెంచరీ, దీపేష్ దేవేంద్రన్ ఐదు వికెట్ల ప్రదర్శన కీలకంగా నిలిచాయి.

బ్యాటింగ్‌లో కుందు సునామీ

టీమిండియా తరఫున ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన వికెట్ కీపర్-బ్యాటర్ అభిజ్ఞాన్ కుందు అద్భుత ప్రదర్శనతో అదరగొట్టాడు. అతడు కేవలం 125 బంతుల్లో 17 ఫోర్లు, 9 సిక్సులతో 209 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇది అండర్-19 వన్డే క్రికెట్ చరిత్రలో భారత్ తరఫున నమోదైన మొట్టమొదటి డబుల్ సెంచరీ కావడం విశేషం. భారత్‌ తరఫున అండర్-19 వన్డేలలో అంబటి రాయుడు (177) పేరిట ఉన్న అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును కుందు బద్దలు కొట్టాడు. కుందు మెరుపు ఇన్నింగ్స్ కారణంగా, భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 408 పరుగుల భారీ స్కోరు సాధించింది.

వేదాంత్ త్రివేది (90 పరుగులు)తో కలిసి కుందు నాలుగో వికెట్‌కు ఏకంగా 209 పరుగులు జోడించాడు. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ కేవలం 26 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సులతో 50 పరుగులు చేసి మెరుపు ఆరంభం ఇచ్చాడు. మలేషియా బౌలర్లలో మహ్మద్‌ అక్రమ్‌ ఒక్కడే 5 వికెట్లు తీశాడు.

దీపేష్ దేవేంద్రన్ మాయాజాలం

409 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన మలేషియా బ్యాటర్లను భారత బౌలర్లు నిలువరించారు. మలేషియా జట్టు కేవలం 32.1 ఓవర్లలో 93 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ జట్టులో హంజా పంగీ (35) మాత్రమే అత్యధిక స్కోరు చేశాడు. కుడిచేతి వాటం పేసర్ దీపేష్ దేవేంద్రన్ తన అద్భుత బౌలింగ్‌తో 5 వికెట్లు (5/22) తీసి మలేషియా పతనాన్ని శాసించాడు. ఉదవ్ మోహన్ 2 వికెట్లు తీయగా, కిషన్ కుమార్ సింగ్, ఖాలాన్ పటేల్, కాన్షిక్ చౌహాన్ తలో వికెట్ పడగొట్టారు.

పరుగుల తేడా పరంగా చూస్తే, ఈ 315 పరుగుల విజయం యూత్ వన్డేల్లో భారత్‌కు లభించిన రెండవ అతిపెద్ద విజయం. 2022లో ఉగాండాపై సాధించిన 326 పరుగుల విజయం ఇప్పటికీ మొదటి స్థానంలో ఉంది.

అండర్-19 ఆసియా కప్: మలేసియాపై భారత్‌ ఘన విజయం - Tholi Paluku