Let's talk: editor@tmv.in
అండర్-19 ఆసియా కప్ ఫైనల్‌కు భారత్

అండర్-19 ఆసియా కప్ ఫైనల్‌కు భారత్

Shaik Mohammad Shaffee
20 డిసెంబర్, 2025

భారత్ అండర్-19 క్రికెట్ జట్టు ఆసియా కప్ ఫైనల్‌కు అర్హత సాధించింది. శుక్రవారం జరిగిన వర్షం కారణంగా 20 ఓవర్లకు కుదించిన సెమీఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక అండర్-19 జట్టును ఎనిమిది వికెట్ల తేడాతో భారత్ ఓడించింది. ఈ విజయంలో విహాన్ మల్హోత్రా, ఆరన్ జార్జ్ కీలక పాత్ర పోషించారు.

వర్షం కారణంగా మ్యాచ్‌ను ఒక్కో జట్టు 20 ఓవర్లు మాత్రమే ఆడేలా నిర్వహించారు. టాస్ గెలిచిన భారత్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. టోర్నమెంట్ అంతా నిలకడగా బౌలింగ్ చేస్తున్న భారత బౌలర్లు ఈ మ్యాచ్‌లోనూ అదే జోరు చూపించారు. శ్రీలంక జట్టును 20 ఓవర్లలో 138 పరుగులకే 8 వికెట్లు పడగొట్టారు. భారత బౌలర్లలో కనిష్క్ చౌహాన్, హెనిల్ పటేల్ తలో రెండు వికెట్లు తీసి జట్టుకు మంచి ఆరంభం అందించారు.

లక్ష్య ఛేదనలో తొలుత తడబాటు

139 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్‌కు మొదట్లోనే గట్టి షాక్ తగిలింది. యువ ఓపెనర్లు ఆయుష్ మాథ్రే కేవలం 7 పరుగులు, వైభవ్ సూర్యవంశీ 9 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగారు. శ్రీలంక బౌలర్ రసిత్ నిమ్సారా వరుస వికెట్లు తీసి భారత్‌ను ఇబ్బందుల్లోకి నెట్టాడు. అయితే, ఆ క్లిష్ట సమయంలో క్రీజులోకి వచ్చిన వైస్ కెప్టెన్ విహాన్ మల్హోత్రా అద్భుతమైన బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నాడు. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ అయిన మల్హోత్రా, ఏమాత్రం తడబడకుండా ఆత్మవిశ్వాసంతో షాట్లు ఆడుతూ రెండు సిక్సర్లు, పలు ఫోర్లతో స్కోరు బోర్డును ముందుకు నడిపించి భారత్‌కు విజయాన్ని ఖాయం చేశాడు. మరోవైపు ఆరన్ జార్జ్ ఎంతో ఓర్పుతో బ్యాటింగ్ చేశాడు. ముఖ్యంగా ఆఫ్ స్పిన్నర్‌పై అతడు ఆడిన డ్రైవ్ షాట్లు ఆకట్టుకున్నాయి. ఈ ఇద్దరూ కలిసి మూడో వికెట్‌కు అజేయంగా 114 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. మల్హోత్రా 45 బంతుల్లో 61 పరుగులు, జార్జ్ 49 బంతుల్లో 58 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. భారత్ 18 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించి ఘన విజయం సాధించింది.

11 ఏళ్ల తర్వాత భారత్-పాక్ ఫైనల్ పోరు

ఈ విజయంతో భారత్ అండర్-19 జట్టు ఎనిమిదోసారి ఆసియా కప్ ఫైనల్‌కు చేరుకుంది. మరో సెమీఫైనల్‌లో పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో 11 ఏళ్ల తర్వాత ఆసియా కప్ అండర్-19 ఫైనల్‌లో భారత్- పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. గతంలో 2014లో ఈ రెండు జట్లు ఆసియా కప్ ఫైనల్లో తలపడ్డాయి. అప్పట్లో భారత జట్టులో శ్రేయస్ అయ్యర్, సంజు శాంసన్, కుల్దీప్ యాదవ్ వంటి వారు ఉండేవారు. ఇప్పుడు సరిగ్గా 11 ఏళ్ల తర్వాత మళ్లీ టైటిల్ కోసం ఈ దాయాది దేశాల మధ్య పోరు జరగనుంది.

అండర్-19 ఆసియా కప్ ఫైనల్‌కు భారత్ - Tholi Paluku