Let's talk: editor@tmv.in
అండమాన్ నికోబార్ దీవుల పేరును 'ఆజాద్ హింద్'గా మార్చండి: ప్రధానికి కవిత లేఖ

అండమాన్ నికోబార్ దీవుల పేరును 'ఆజాద్ హింద్'గా మార్చండి: ప్రధానికి కవిత లేఖ

Gaddamidi Naveen
24 జనవరి, 2026

నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి సందర్భంగా జాగృతి కేంద్ర కార్యాలయంలో ఘన నివాళులర్పించారు. జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నేతలు ఈ వేడుకల్లో పాల్గొని నేతాజీ చిత్రపటానికి పూలమాలలు వేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఆజాద్ హింద్ ఫౌజ్ ద్వారా ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమని, నేటి తరానికి ఆయన ఆదర్శప్రాయుడని ఈ సందర్భంగా కవిత కొనియాడారు.

అనంత‌రం అండమాన్ నికోబార్ దీవుల పేరును ఆజాద్ హింద్ గా మార్చాలని కోరుతూ కల్వకుంట్ల కవిత ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.నేతాజీ వారసత్వానికి ఆయన కన్న 'ఆజాద్ హింద్' కలలకు ఇది నిజమైన గౌరవం అవుతుందని ఆమె పేర్కొన్నారు.

కవితా లేఖలో, గత జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో బీజేపీ హైదరాబాద్‌ నగరాన్ని ‘భాగ్యనగర్‌’గా మార్చే ప్రతిపాదన చేసినప్పటికీ, అది రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే ఉండిందని గుర్తు చేశారు. ఆ ప్రతిపాదనకు ప్రజలు స్పందించలేదు. అయితే అండమాన్ నికోబార్‌ దీవుల పేరుపై మార్పు, నిజమైన జాతీయ గర్వాన్ని ప్రతిబింబించే విధంగా ఉండాలి అని ఆమె పేర్కొన్నారు.

అంతేకాక, ఈ చర్య ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పౌర సంఘం సుదీర్ఘకాలంగా చేస్తున్న డిమాండ్ అని, తాము దానికి పూర్తి మద్దతు ఇస్తున్నామని తెలిపారు. అండమాన్ నికోబార్ దీవులకు 'ఆజాద్ హింద్' అని పేరు పెట్టడం ద్వారా దేశం పట్ల నేతాజీకి ఉన్న అంకితభావానికి ఘనమైన నివాళి అర్పించినట్లవుతుందని కవిత తన లేఖలో ఆకాంక్షించారు. జాతీయ గర్వాన్ని చాటేలా ఈ చారిత్రక నిర్ణయం తీసుకోవాలని ప్రధానిని కోరారు. నేతాజీ ప్రదర్శించిన ధైర్యసాహసాలు, దేశం కోసం చేసిన త్యాగాలను స్మరించుకుంటూ ఈ ప్రతిపాదనను సీరియస్ గా పరిగణించాలని ఆమె విన్నవించారు.

అండమాన్ నికోబార్ దీవుల పేరును 'ఆజాద్ హింద్'గా మార్చండి: ప్రధానికి కవిత లేఖ - Tholi Paluku