
అండమాన్‌లో సముద్రంలో కూలిన హెలికాప్టర్..ఏడుగురు సురక్షితం
పవన్ హన్స్ కు చెందిన ఒక హెలికాప్టర్ మంగళవారం ఉదయం అండమాన్‌లో సముద్రంలో కూలిపోయింది. హెలికాప్టర్‌లో ఇద్దరు సిబ్బందితో పాటు ఐదుగురు ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ బృందాలు స్పందించి, ఏడుగురినీ సురక్షితంగా రక్షించాయి. అధికారుల వివరాల ప్రకారం, ఈ ఘటన ఉదయం సుమారు 9.30 గంటల సమయంలో జరిగింది. హెలికాప్టర్ రంగట్ నుంచి మాయాబందర్‌కు వెళ్తుండగా, మాయాబందర్ హెలిప్యాడ్‌కు సుమారు 300 మీటర్ల దూరంలో సముద్రంలో (స్వల్పలోతు నీటిలో) కూలిపోయింది. పవన్ హన్స్ లిమిటెడ తెలిపిన వివరాల ప్రకారం, పీహెచ్ఎల్ డౌపిన్ ఎన్3 హెలికాప్టర్ (వీటీ-పీహెచ్ వై) ఉదయం 8.30 గంటలకు శ్రీ విజయపురం (పోర్ట్ బ్లెయిర్) నుంచి బయలుదేరి, రంగట్‌కు చేరుకుంది. అక్కడ నుంచి మాయాబందర్‌కు బయలుదేరిన కొద్ది సేపటికే ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
సివిల్ ఏవియేషన్ ఉన్నతాధికారి ప్రాథమిక విచారణలో సాంకేతిక లోపం (టెక్నికల్ స్నాగ్) కారణమై ఉండవచ్చని తెలిపారు. పైలట్ సముద్రంలో క్రాష్-ల్యాండింగ్ చేసినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని చెప్పారు. రక్షించిన వారిని మాయాబందర్‌లోని డా. రాజేంద్ర ప్రసాద్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సివిల్ ఏవియేషన్ డైరెక్టర్ నితేష్ రావత్ మాట్లాడుతూ, పైలట్ స్టేట్‌మెంట్ ఇంకా నమోదు చేయాల్సి ఉందని, గాయపడిన వారిని శ్రీ విజయపురానికి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.
ఉత్తర, మధ్య అండమాన్ జిల్లా డిప్యూటీ కమిషనర్ సుశాంత్ పడా ప్రకారం, రెస్క్యూ బృందాలు, పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది, కోస్ట్ గార్డ్ తక్షణమే స్పందించి అందరినీ మధ్య సముద్రం నుంచి రక్షించారు. హెలికాప్టర్‌లో ప్రయాణించిన వారు రాజితా దేవి, కమల చంద్ర దాస్, శిప్రా సాహా, నంబి అమ్మ, పైలట్లు కెప్టెన్ అనిల్ జాను, కెప్టెన్ టీపీఎస్ గులియా కాగా, ఒక చిన్నారి గుర్తింపుపై స్పష్టత రావాల్సి ఉంది. అందరూ సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అండమాన్-నికోబార్ దీవుల డీజీపీ హర్గోబిందర్ సింగ్ ధాలివాల్, మెరైన్ పోలీస్ బలగాల వేగవంతమైన చర్యలను ప్రశంసించారు. గాయపడిన వారికి అవసరమైన సహాయం అందించడం ప్రాధాన్యమని అధికారులు వెల్లడించారు.
