Let's talk: editor@tmv.in
అండమాన్‌లో రూ.36,000 కోట్ల విలువైన ‘క్రేజీడ్రగ్‌’ధ్వంసం

అండమాన్‌లో రూ.36,000 కోట్ల విలువైన ‘క్రేజీడ్రగ్‌’ధ్వంసం

Pinjari Chand
15 మార్చి, 2026

అండమాన్ నికోబార్ పోలీస్‌ అధికారులు సుమారు రూ.36,000 కోట్ల విలువైన 6,000 కిలోలకుపైగా మెథాంఫెటమైన్ (మెత్) మత్తుపదార్థాన్ని దశల వారీగా ధ్వంసం చేశారు. ఈ ప్రక్రియ 2025 జూన్ 26న ప్రారంభమై 2026 మార్చి 12న పూర్తైంది. ఇది దేశంలో ధ్వంసం చేసిన అతిపెద్ద డ్రగ్స్‌ చర్యల్లో ఒకటిగా భావిస్తున్నారు. ఈ మత్తుపదార్థాన్ని ముందుగా 2024 నవంబర్ 23న ఇండియన్ కోస్ట్‌గార్డ్‌ నిర్వహించిన భారీ మాదకద్రవ్యాల నిరోధక ఆపరేషన్‌లో స్వాధీనం చేసుకున్నారు. అండమాన్ దీవుల సమీపంలోని భారత జలాల్లో మయన్మార్‌కు చెందిన ఆరుగురు సిబ్బందితో ఉన్న ఓ నౌకను ఆపి తనిఖీ చేయగా ఈ భారీ మత్తు పదార్థాల విషయం బయటపడింది.

అధికారుల ప్రకారం, సుమారు 1,500 ప్యాకెట్లలో ప్యాక్ చేసిన 6,000 కిలోలకుపైగా స్ఫటికాకార మెథాంఫెటమైన్‌ను నౌక నుంచి స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ సుమారు రూ.36,000 కోట్లు ఉంటుందని అంచనా. మెథాంఫెటమైన్‌ను ‘క్రేజీ డ్రగ్’ అని కూడా పిలుస్తారు. ఇది అత్యంత బానిసగా చేసుకునే మత్తు పదార్థం కావడంతో భారత్‌లో నిషేధించారు. ఈ కేసును తరువాత అండమాన్ నికోబార్ పొలీసులు విచారణకు తీసుకుని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హర్‌‌గోబిందర్‌‌ సింగ్ దలీవాల్‌ పర్యవేక్షణలో దర్యాప్తు నిర్వహించారు. 2024 నవంబర్ 26న నార్కోటిక్స్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోట్రోపిక్‌ సబ్‌స్టాంటెన్స్ యాక్ట్ట్ 1985, ఫారినర్స్‌ యాక్ట్‌ 1946, భారతీయ న్యాయసంహిత 2023, చట్టాల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. భారీ పరిమాణంలో మత్తుపదార్థం ఉన్నప్పటికీ, పూర్తి ప్రణాళికతో, చట్టపరమైన విధానాలను పాటిస్తూ ధ్వంసం ప్రక్రియను సమర్థంగా పూర్తి చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఈ మత్తుపదార్థాన్ని 2025 జూన్ 25 నుంచి 2026 మార్చి 12 వరకు శ్రీ విజయపురంలోని మిన్నీ బేలో ఉన్న ఐఎన్‌హెచ్‌ఎస్‌ ధన్వంతరిలోని ఇన్సినరేషన్ సౌకర్యంలో కాల్చి ధ్వంసం చేశారు. ఈ ప్రక్రియను ఉన్నత స్థాయి డ్రగ్ డిస్పోజల్ కమిటీ పర్యవేక్షించింది. కమిటీకి డీఐజీపీ (పీఆర్) డాక్టర్ డా.ఏ కోన్‌ అధ్యక్షత వహించగా, డీఐజీపీ (సీఐడీ)జితేంద్రకుమార్ మీనా, ఎస్‌పీ (కమాండెంట్ హెచ్‌జీ) రవికాంత్‌కుమార్‌‌ సభ్యులుగా ఉన్నారు.

అండమాన్‌లో రూ.36,000 కోట్ల విలువైన ‘క్రేజీడ్రగ్‌’ధ్వంసం - Tholi Paluku