
అంగరంగ వైభవంగా అంతర్జాతీయ వేడుక.. గ్లోబల్ సదస్సుకు ప్రపంచ నేతలు
తెలంగాణ భవిష్యత్తు దిశానిర్దేశాన్ని నిర్వచించనున్న 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025' డిసెంబర్ 8, 9 తేదీలలో భారత్ ఫ్యూచర్ సిటీలో అంగరంగ వైభవంగా జరగనుంది.తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025 కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశ్రమల నాయకులు, నిపుణులు, విద్యావేత్తలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు హాజరు కానున్నారు. భవిష్యత్ తెలంగాణ అభివృద్ధి మార్గరేఖను నిర్ధేశించే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ రెండు రోజుల సదస్సులో మొత్తం 27 ప్రత్యేక ప్యానెల్ చర్చలు జరగనున్నాయి.
ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ, ఐటీ సెమీకండక్టర్లు, ఆరోగ్యం, విద్య, పర్యాటకం, పట్టణాభివృద్ధి, వ్యవసాయం, పరిశ్రమలు, మహిళా పారిశ్రామిక వేత్తల ప్రోత్సాహం, గిగ్ ఎకానమీ, సామాజిక సంక్షేమం, స్టార్టప్స్ వంటి కీలక రంగాల్లో నిపుణులు పాల్గొని మార్గదర్శక చర్చలు జరపనున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ యూనిసెఫ్ వంటి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఇందులో పాల్గొంటారు. టీఈఆర్‌ఐ, బీసీజీ, మైక్రాన్ ఇండియా, హిటాచి ఎనర్జీ, అపోలో హాస్పిటల్స్, ఐఐటీ హైదరాబాద్, నాస్కామ్, డీఆర్‌డీఓ వంటి ప్రముఖ సంస్థల అధినేతలు హాజరుకానున్నారు.
క్రీడలు, సినిమా ప్రముఖులు
ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ క్రీడా ప్రముఖులు పీ.వీ. సింధు, అనిల్ కుంబ్లే, పుల్లెల గోపీచంద్, గగన్ నారంగ్, జ్వాలా గుత్తా పాల్గొంటారు.సినీ ప్రముఖులు ఎస్.ఎస్. రాజమౌళి, రితేష్ దేశ్‌ముఖ్, సుకుమార్, గునీత్ మోంగా, అనుపమ చోప్రా చర్చలో పాలుపంచుకుంటారు.
విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంత్రులు, ఉన్నతాధికారులు అన్ని ఏర్పాట్లను సమన్వయం చేస్తున్నారు.ఈ వేదిక సుమారు 100 ఎకరాల ప్రాంతంలో జరగనుంది.ఈ సమ్మిట్‌ను వార్షికంగా జరిగే దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ప్రమాణాలకు సమానంగా సదస్సును రూపుదిద్దేందుకు సీఎం వ్యక్తిగతంగా సమీక్షిస్తున్నారు.
డిసెంబర్ 9న, తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించనున్నారు. రాష్ట్రాన్ని 2047 నాటికి 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో రూపొందించిన ఈ రోడ్‌మ్యాప్ తెలంగాణ భవిష్యత్‌కు దిశానిర్దేశం చేయనుంది.సమ్మిట్ మొత్తం రంగాల్లో అభివృద్ధి, పెట్టుబడి ప్రోత్సాహం, సాంకేతిక సహకారం, నూతన ఆవిష్కరణల ఆధారిత వృద్ధికి మార్గం సుగమం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.
