
అంగన్వాడీ కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ:మంత్రి కొలుసు పార్థసారథి
గ్రామీణ నిరుపేదలు, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వ సేవలు మరింత సులభంగా, వేగంగా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార–పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. శుక్రవారం నూజివీడు క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన 319 మంది అంగన్వాడీ టీచర్లు, కార్యకర్తలకు 5జీ స్మార్ట్ మొబైల్ ఫోన్లు మంత్రి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ సేవల్లో పారదర్శకత, వేగం పెంచేందుకు స్మార్ట్ టెక్నాలజీని అంగన్వాడీ వ్యవస్థలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిందని తెలిపారు. పిల్లల పోషణ, గర్భిణులు–తల్లుల ఆరోగ్య పర్యవేక్షణ మరింత సమర్థవంతంగా జరగాలన్న ఉద్దేశంతో డిజిటల్ విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు.
అంగన్వాడీ కార్యకర్తలపై పని భారం తగ్గించేందుకు అనవసర యాప్‌ల సంఖ్యను తగ్గించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పంపిందని చెప్పారు. గతంతో పోలిస్తే అంగన్వాడీ సిబ్బందికి గౌరవం, ఆర్థిక భద్రత పెరిగిందని పేర్కొన్నారు.
అంతేకాక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే అంగన్వాడీ సిబ్బంది వేతనాల పెంపు జరిగిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఉన్న 5 వేల మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాల స్థాయికి అప్‌గ్రేడ్ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని అన్నారు. దీని వల్ల పోస్టుల సంఖ్య పెరగడంతో పాటు భవనాలు, తాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక వసతుల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సవాళ్లతో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమర్థ నాయకత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకారంతో ఆర్థిక వ్యవస్థను క్రమబద్ధీకరిస్తున్నామని మంత్రి తెలిపారు.
అంగన్వాడీ కార్యకర్తలు ప్రభుత్వ పనిలో కీలక పాత్ర వహిస్తున్నారు వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఏప్పటికీ కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. అంగన్వాడీ టీచర్లు, వర్కర్లకు రిటైర్ అనంతరం సుమారు రూ. లక్ష గ్రాట్యుటీ అందిస్తున్నామని అదేవిధంగా ఆ ప్రభుత్వము అందించని స్థాయిలో సిబ్బంది మరణిస్తే అంత్యక్రియల కోసం రూ.15 వేల ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, అంగన్వాడీ టీచర్లు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు కూటమి నాయకులు, పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.
