Let's talk: editor@tmv.in
అంకిత భావంతో, సామాజిక బాధ్యతతో పని చేయండి

అంకిత భావంతో, సామాజిక బాధ్యతతో పని చేయండి

FL - YUGDR
5 అక్టోబర్, 2025

వైద్య వృత్తిలో రాణించాలంటే అంకితభావంతో పాటు సామాజిక బాధ్యతతో ఎదగాలని స్వీయ ప్రతిభను పెంచుకోవాలని కృత్రిమ మేధ వంటి సాంకేతికతను ఉపయోగించుకోవాలని నీట్‌ ద్వారా గీతం వైద్య కళాశాలలో 2025 సంవత్సరానికి ప్రవేశం పొందిన ఎంబిబిఎస్‌ విద్యార్ధులకు వైద్య నిపుణులు సూచించారు. గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయంకు అనుబంధంగా గల గీతం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ రీసెర్చి (జిమ్‌సర్‌) వైద్య కళాశాలలో 2025 బ్యాచ్‌ నూతన ఎంబిబిఎస్‌ విద్యార్ధులకు ‘‘వైట్‌కోట్‌ ధారణ’’ ఉత్సవాన్ని శనివారం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హజరైన డాక్టర్‌ ఎన్‌.టి.ఆర్‌.ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ డాక్టర్‌ వి.రాధిక రెడ్డి మాట్లాడుతూ, వైద్యరంగం గణనీయమైన మార్పులకు గురవుతోందని అందుకు తగిన విధంగా జాతీయ వైద్య మండలి సంస్కరణలను తీసుకువచ్చిందని తెలిపారు. వైద్య విద్యార్ధులు గ్రంధాలతో పాటు రోగిని, రోగ లక్షణాలను చదవడం నేర్చుకోవాలని, అలాగే కమ్యూనికేషన్‌ నైపుణ్యాలను కలిగి ఉండాలని సూచించారు. నిరంతర సాధన, మానవతా విలువలు, సమాజం పట్ల బాధ్యత ఉంటే వైద్య వృత్తిలో అగ్రస్థానానికి చేరవచ్చని సూచించారు. ప్రముఖ ఆంకాలజి నిపుణుడు డాక్టర్‌ డి.రఘునాధరావు మాట్లాడుతూ వైద్యరంగంలో కృత్రిమ మేధ పరిజ్ఞానం రానున్న రోజులలో కీలక భూమిక వహించనున్నదని అయితే వృత్తి నైపుణ్యం, మానవ సంబంధాలు, రోగ లక్షణాలను విశ్లేషించి రోగికి మానసికంగా ధైర్యం చెబుతూ వైద్యులు అందించే చికిత్సకు ప్రత్యామ్నాయం లేదన్నారు. ఒత్తిడికి లోనవకుండా వైద్య విద్యార్ధులు వృత్తిలోని నైపుణ్యాలను పెంచుకోవాలని సూచించారు.

గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ వై.గౌతమ్‌రావు మాట్లాడుతూ గీతం ప్రతిభ స్కాలర్‌షిప్‌లను అధిక శాతం మంది విద్యార్ధులు ఉపయోగించుకుని ఈ ఏడాది ప్రవేశాలు పొందారని వెల్లడించారు. వైద్య వృత్తిలోకి ప్రవేశించే వారు నిరంతర విద్యార్ధిగా ఉండాలని, విలువలకు ప్రాధాన్యత ఇవ్వాలని, రోగుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలన్నారు. జిమ్‌సర్‌ ప్రో వైస్‌ ఛాన్స్‌లర్‌ డాక్టర్‌ బి.గీతాంజలి మాట్లాడుతూ వైద్య విద్యార్ధులు తెల్లకోటు ప్రాధాన్యతను అర్ధం చేసుకొని విలువలతో వృత్తిలో ఎదగాలన్నారు.

జిమ్‌సర్‌ వైద్య కళాశాల డీన్‌ డాక్టర్‌ ఎస్‌.పి.రావు మాట్లాడుతూ దేశంలోని 22 రాష్ట్రాలకు చెందిన వారు ప్రస్తుత విద్యాసంవత్సరంలో గీతం వైద్య కళాశాలో ప్రవేశం పొందారని తెలిపారు. విద్యార్ధులలో నైపుణ్యాలను పెంచడానికి స్కిల్‌ ల్యాబ్‌ ప్రారంభించామని వెల్లడించారు. గీతం వైద్య కళాశాల, ఆసుపత్రిలో 15 సూపర్‌ స్పెషాలిటి విభాగాల ద్వారా దాదాపు 400 మంది వైద్య నిపుణులు, 500 మంది నర్సింగ్‌ సిబ్బంది నిరంతరం వైద్య సేవలు అందిస్తున్నారని చెప్పారు.

గీతం అసుపత్రి సూపరెండెంట్‌ డాక్టర్‌ వి.వి.ఎల్‌.నరసింహరావు పాల్గొని విద్యార్ధులతో వైద్య వృత్తి పట్ల నిబద్ధతతో, విలువలతో వ్యవహరిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ‘వైట్‌కోట్‌ ధారణ’లో భాగంగా నూతనంగా ప్రవేశం పొందిన వైద్య విద్యార్ధులకు అతిధుల చేతుల మీదుగా తెల్లకోటును అందజేశారు. కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల నుంచి విద్యార్ధుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

అంకిత భావంతో, సామాజిక బాధ్యతతో పని చేయండి - Tholi Paluku